గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (13:37 IST)

భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం నేరం కాదు.. : కర్నాటక హైకోర్టు

marriage
అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యతో భర్త శారీరక శృంగారానికి నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్‌ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తన వివాహం పరిపూర్ణం కాలేదంటూ తన భర్త, అత్తామామలపై ఓ మహిళ పెట్టిన క్రిమినల్‌ కేసును న్యాయస్థానం కొట్టేసింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, పిటిషన్ దారురాలైన ఓ మహిళకు డిసెంబరు 18, 2019లో వివాహమైంది. అయితే, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే ఆమె భర్త.. ఆమెతో శారీరక బంధాన్ని ఏర్పరుచుకునేందుకు నిరాకరించాడు. దీంతో కేవలం 28 రోజులు మాత్రమే అత్తింట్లో ఉన్న ఆ మహిళ పుట్టింటికి వచ్చేసింది. 2020 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్‌ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద భర్త, అత్తామామలపై కేసు పెట్టింది. 
 
దీంతో పాటు హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని, తన పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఈమె పిటిషన్‌ను పరిశీలించిన కుటుంబ న్యాయస్థానం 2022 నవంబరులో వీరి వివాహాన్ని రద్దు చేసింది. అయితే, అత్తింటివారిపై పెట్టిన క్రిమినల్‌ కేసును మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు.
 
దీంతో తనపై, తన తల్లిదండ్రులపై నమోదైన ఛార్జ్‌షీట్‌ను సవాల్‌ చేస్తూ ఆ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఈ కేసులో భర్తపై ఉన్న ఆరోపణ ఒక్కటే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆయన.. ప్రేమ అంటే కేవలం మనసులకు సంబంధించినది మాత్రమే గానీ.. శారీరక బంధం కాదని విశ్వసించాడు. 
 
అయితే, వివాహం చేసుకున్న భార్యతో శారీరక బంధాన్ని నిరాకరించడం.. హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఐపీసీ సెక్షన్‌ 498ఏ ప్రకారం అది నేరం కిందకు రాదు. అందువల్ల ఈ కేసులో భర్తపై క్రిమినల్‌ చర్యలు చేపడితే అది వేధింపుల కిందకే వస్తుంది. అందువల్ల ఈ పిటిషన్‌ను అంగీకరించి అతడిపై ఉన్న క్రిమినల్‌ కేసును కొట్టేస్తున్నాం' అని హైకోర్టు తీర్పు వెలువరించింది.