శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (11:32 IST)

మూగ జీవులకు ఉన్న బుద్ధి మనుషులకు లేకపాయె... పులి నుంచి ఆవుకు రక్షణగా నిలిచిన గోవుల మంద...

cow attack on tiger
మన కళ్ల ఎదుటే అనేక రకాలైన నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి. వాటిని చూస్తూనే వెళ్తాం కానీ.. ఇదేం అన్యాయమని ప్రశ్నించం. ఒక వ్యక్తిని రోడ్డుపై పట్టపగలు దారుణంగా నరికి పారేస్తున్నా... కళ్లప్పగించి చూస్తామేగానీ రక్షించేందుకు ఏమాత్రం సాహసం చేయం. కానీ, ఈ మూగ జీవులు.. తమలోని ఒక గోవు పులి బారినపడితే.. దాన్ని ఏ విధంగా రక్షించుకున్నాయో తెలిపే వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒంటరిగా ఉన్న ఆవుపై ఓ పులి దాడి చేసింది. దీన్ని గమనించిన మరికొన్ని ఆవుల మంద ఆ పులి వద్దకు వెళ్లాయి. ఈ గోవుల మందను చూసిన పూలి.. కాలికి బుద్ధి చెప్పి.. పరుగు పెట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాత్రి వేళ ఓ ఫామ్ హౌస్‌కు దూరంగా నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడి చేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న కొన్ని ఆవుల మంద అటువైపు తిరిగి పులిని చూశాయి. అంతే.. ఒక్కసారిగా కలిసికట్టుగా అన్నీ వెళ్లి పులిని భయపెట్టాయి. తనపై దాడికి వచ్చిన మందను చూసిన పులి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ అరుదైన దృశ్యం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు సమీపంలో ఉన్న కేర్వా ప్రాంతంలో ఆదివారం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. 
 
ఆవుల మంద దాడి చేయడంతో పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిన పులి తిరిగి దాడి చేసేందుకు సమయం కోసం మూడు గంటల పాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో గాయపడిన ఆవు చుట్టూత చేరిన మిగిలిన ఆవులు ఆ రాత్రంతా దానికి రక్షణగా నిలిచాయి. ఉదయం గాయపడిన ఆవును చూసిన యజమాని దానిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి విషమంగా ఉంది. కాగా, 76 ఎకరాల ఫామ్ హౌస్‌లో 500 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఈ సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.