శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (11:10 IST)

ఇద్దరు కాదు.. ముగ్గురెళ్లినా ఢోకా లేదు... ఇపుడు రిలాక్సయ్యా : కర్ణాటక సీఎం కుమార స్వామి

తమ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి స్పందించారు. ఇద్దరు కాదు.. ముగ్గురెళ్లినా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు. కనీస మెజార్టీ కంటే ఎక్కువగానే తమకు మద్దతు ఉందని ఆయన ప్రకటించారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుండగా, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారిలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్‌లు కూడా ఉన్నారు. వీరిద్దరూ స్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు. 
 
ఈ పరిణామాలపై కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటే పోయిన నష్టమేమి లేదన్నారు. తాను ఎలాంటి ఆందోళన చెందడం లేదన్నారు. తమ బలమేంటో తమకు తెలుసన్న కుమారస్వామి.. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. 
 
ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది కానీ.. తమకు పూర్తి స్థాయి మెజార్టీ ఉందన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఉపసంహరణతో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 120 నుంచి 118కి చేరింది. మేజిక్ ఫిగర్ 113 కాగా, ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు.