కేరళ సీరియల్ కిల్లర్ జూలీ ఆత్మహత్యాయత్నం.. ఎందుకో?
కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం చేతిని కోసుకుంది. దీంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం జూలీని కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ హతమార్చింది. అంతేకాకుండా కట్టుకున్న భర్త రాయ్ థామస్‌ను కూడా ఆమె దారుణంగా హతమార్చి, ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కట్టుకథ అల్లింది. అయితే కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాయ్ థామస్ సోదరుడు మోజోకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, విచారణలో నమ్మలేని వెలుగు చూశాయి. రాయ్ థామస్ సైనైడ్ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని తేలింది.
ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడ్డాయి. దీంతో జూలీతో పాటు ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.