మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 8 ఆగస్టు 2020 (17:52 IST)

కొడైకెనాల్‌‌లో ఖమ్మం టెక్కీ యువజంట ఆత్మహత్య... జీతాలు రాక, ఆర్థిక సమస్యలతో...

తెలంగాణకు చెందిన ఓ యువ జంట కొడైకెనాల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనా కారణంగా గత మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో దంపతులు ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాధమిక సమాచారం.
 
 ఇక వివరాలు పరిశీలిస్తే.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26) భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26) ఇద్దరూ భార్యాభర్తలు.
 
2018లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు కొడైకెనాల్‌లోని అన్నయ్‌ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు. స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కిరాణా సరుకులు సరఫరా చేసే యువకుడు వారి ఇంటికి వెళ్లగా తలుపులు తీయలేదు.
 
ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో లోపలికి చూశాడు. దంపతులిద్దరూ నోట్లో నుంచి నురగలు కక్కి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. కాగా గోపీకృష్ణ దంపతులు కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నారని విచారణలో ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు.
 
గత 3 నెలలుగా జీతాలు సరిగా రావడం లేదని చెప్పినట్లు వివరించాడు. అయితే దంపతులిద్దరూ కొద్దికాలంగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ ప్రయత్నాలు ఫలించడంలేదన్న బాధ కూడా వున్నట్టు తెలుస్తోంది.