ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (12:25 IST)

జూనియర్ వైద్యురాలితో నలుగురు జుడాల డిన్నర్.. ఆ తర్వాత ఏం జరిగింది?

victim woman
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో ఓ జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులోని నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ సహ జూనియర్ వైద్యులు గత ఐదు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. హత్యాచారం జరిగిన జూనియర్ వైద్యురాలితో కలిసి సహ జూనియర్ డాక్టర్లు నలుగురు డిన్నర్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ మహిళా వైద్యురాలు హత్యకు గురైంది. దీంతో మృతురాలితో డిన్నర్ చేసిన నలుగురు జూనియర్ డాక్టర్ల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఆసుపత్రి నుంచి మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వెళ్లినట్లు సమాచారం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ కాల్ చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది.
 
అయితే తర్వాత ఆ మృతిని హత్యగా గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు హత్యాచారం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ అధికారిని కూడా ప్రశ్నిస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క పోలీసులు ఏడుగురు జూనియర్ డాక్టర్లను ప్రశ్నించారు. అందులో నలుగురు ఆమెతో డిన్నర్ కూడా చేశారు.
 
తమ డిమాండ్లు నెరవేరే వరకు, న్యాయం జరిగేవరకు సమ్మెను విరమించబోమని ఇప్పటికే ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. నో సేఫ్టీ-నో డ్యూటీ అంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. వీరితోపాటుగా కోల్‌కతా, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు వినూత్న ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. 'స్వాతంత్ర్యం వచ్చిన అర్థరాత్రి మహిళల స్వాతంత్ర్యం కోసం' పేరిట రేపు రాత్రి 11.55 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు.
 
ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలో ఆయా ప్రాంతాలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి సంఘీభావంగా పలువురు పురుషులు కూడా ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. స్వస్తికా ముఖర్జీ, చర్నీ గంగూలీ, ప్రతిమ్‌ డి గుప్తా వంటి సినీ ప్రముఖులు మద్దతుగా రానున్నారు. సోమవారం బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. 
 
వారం రోజుల్లోగా కేసును పరిష్కరించాలని పోలీసులకు అల్టిమేటం జారీచేశారు. 'ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నట్లైతే వారందరినీ ఆదివారంలోగా అరెస్టు చేస్తాం. ఒకవేళ అప్పటిలోగా రాష్ట్ర పోలీసులు కేసును పరిష్కరించలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తాం' అని తెలిపారు. అయితే, జూనియర్ వైద్యులు మాత్రం ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.