ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:25 IST)

అగ్రిగోల్డ్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్టు!!

jogi rajeev
మాజీ మంత్రి, వైకాపా నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా రాజీవ్‌ ఉన్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్‌ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 
 
మొత్తం 15 మంది ఏసీబీ అధికారుల బృందం మంగళవారం ఉదయం 5 గంటల నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. ఇంటిని మొత్తాన్ని జల్లెడ పట్టిన అధికారులు.. కీలకమైన రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసులో కీలక వ్యక్తి అయిన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అరెస్టు చేశారు. 
 
ఈ సందర్భంగా జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ కక్ష పూరిత చర్య అంటూ ఆరోపించారు. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేస్తున్నారంటూ ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్టే తాము కూడా భూములు కొన్నామని, అందులో తప్పేముందో తనకు అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. కాగా, సీఐడీ అధికారుల దర్యాప్తులో భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేశ్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఇటీవల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.