సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (15:47 IST)

కేఫ్ కాఫీ డే కుమారుడికి త్వరలో పెళ్లి.. వధువు ఎవరంటే?

దేశంలో కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ పీకల్లోతు అప్పుల కారణంగా గత యేడాది ఆత్మహత్యచేసుకున్నాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఇపుడు సిద్ధార్థ్ తనయుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని పేరు అమర్త్య హెగ్డే. ఈయనకు కర్నాటక రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తెనిచ్చి వివాహం చేయనున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఇందుకు సంబంధించి మాట్లాడుకున్నట్లు సమాచారం. 
 
డీకే శివకుమార్ పెద్ద కుమార్తె ఐశ్వర్య. వీజీ సిద్ధార్థ ఇద్దరు కుమారుల్లో అమర్త్య హెగ్దే ఒకరు. ఐశ్వర్య, అమర్త్య హెగ్దే నిశ్చితార్థం ఆగస్టు మొదటి వారంలో జరగనున్నట్లు సమాచారం. అయితే.. పెళ్లి మాత్రం ఈ సంవత్సరం చివరిలో జరపాలని ఇరు కుటుంబాలు భావించినట్లు తెలిసింది. 
 
వీజీ సిద్ధార్థ మరణించిన కొన్నాళ్ల తర్వాతే ఈ పెళ్లి ప్రతిపాదన గురించి అమర్త్యతో మాట్లాడారని, అయితే.. కొంత సమయం కావాలని ఆ సందర్భంలో అమర్త్య స్పష్టం చేసినట్లు తెలిసింది. అమర్త్య, ఐశ్వర్య గత వారం ఒకరినొకరు కలుసుకున్నారని, ఇద్దరూ పెళ్లికి అంగీకారం తెలపడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించినట్లు సమాచారం. 
 
ఐశ్వర్య(22) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాగా, తండ్రి శివకుమార్ స్థాపించిన గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ బాధ్యతలను ఆమె చూసుకుంటోంది. అమర్త్య తల్లి మాళవికతో కలిసి తండ్రి మరణానంతరం వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తున్నారు.