ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 31 మే 2020 (18:22 IST)

కొండలను సైతం ఢీకొట్టిన ఘనుడు - కృష్ణ జీవితంలో మధుర ఘట్టాలు..

సాహసాలకు మారు పేరు..
ప్రయోగాలకు అసలు పేరు..
సంచలనాలకు పెట్టింది పేరు..
ఆయనే సూపర్ స్టార్ కృష్ణ.
 
కొండలను సైతం ఢీకొట్టిన ఘనుడు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తను అనుకున్నది చేసి చూపిన డేరింగ్ హీరో. తెలుగు సినిమాకు కొత్త రంగులు, కొత్త హంగులు.. కొత్త రుచులు.. కొత్త బాటలు చూపించిన డాషింగ్ హీరో ఎవరు అంటే... ఠక్కున చెప్పేది కృష్ణ గురించే. తన మాటలతో, చేతలలో నిజాయితీతో నాలుగు దశాబ్ధాల పాటు సూపర్ స్టార్‌గా చిత్రసీమను ఏలినా... దర్పంగానీ, గర్వంగానీ లేని లేదు. తన సినిమా గురించి అయినా.. ఇతరుల సినిమాల గురించి అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రియల్ హీరో... నటశేఖర కృష్ణ..! తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాలలో హీరోగా రికార్డు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో సుమధుర ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం..!
 
1943 సంవత్సరంలో ఘట్టమనేని వీర రాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు తొలి సంతానంగా గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించారు. 1956వ సంవత్సరంలో తెనాలి హైస్కూల్‌లో కృష్ణ ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసారు. ఆ తర్వాత 1960వ సంవత్సరంలో ఏలూరు సి.ఆర్.ఆర్. కాలేజీలో బి.ఎస్.సి పూర్తి చేసారు. అయితే... చిన్నప్పటి నుంచి కృష్ణకు నటన అంటే మక్కువ ఎక్కువ. అందుకనే.. 1960వ సంవత్సరంలో కృష్ణ తొలిసారి స్టేజీ మీద 'పాపం కాశీకెళ్లినా' అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్ బాబు కూడా నటించడం విశేషం.
 
1961 సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో ప్రదర్శించిన 'ఛైర్మన్ నాటకం'లో కృష్ణ నటనకు పలువురు ప్రముఖులు ప్రశంసించారు. 1962వ సంవత్సరంలో గుంటూరు జిల్లా కంచర్ల పాలెంలో కృష్ణకు ఇందిరాదేవితో వివాహం జరిగింది. పెళ్లైన సంవత్సరానికి అంటే... 1963వ సంవత్సరంలో బాబు మూవీస్ నిర్మించిన "తేనె మనసులు" చిత్రానికి కృష్ణ హీరోగా ఎంపికయ్యారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. 1965వ సంవత్సరంలో కృష్ణ నటించిన తొలి చిత్రం "తేనె మనసులు" రిలీజైంది. అదే సంవత్సరం కృష్ణ - ఇందిరాదేవి దంపతులకు తొలి సంతానం రమేష్ బాబు పుట్టారు.
 
1966 సంవత్సరంలో భారతదేశంలో తొలి గూఢాచారి చిత్రం "గూఢాచారి 116" చిత్రం రిలీజైంది. ఈ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ. ఆ తర్వాత 1967వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో కృష్ణ నటించిన "సాక్షి" విడుదలైంది. ఈ చిత్రం మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 
 
ఇక కృష్ణ కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం అంటే గుర్తుకువచ్చేది 'అల్లూరి సీతారామరాజు' చిత్రం. ఈ సినిమాకి ప్రేరణ ఏంటంటే... 1968వ సంవత్సరంలో కృష్ణ 'అసాధ్యుడు' చిత్రంలోని ఓనాటకం సన్నివేశంలో తొలిసారి అల్లూరి సీతారామరాజుగా 15 నిమిషాల పాటు నటించారు. ఆ చిత్రమే కృష్ణ సీతారామరాజు చిత్రానికి ప్రేరణ. అదే సంవత్సరంలో పెద్ద కుమార్తె పద్మావతి జన్మించింది.
 
సూపర్ స్టార్ కృష్ణ 1969వ సంవత్సరంలో శోభన్ బాబుతో కలిసి మొట్టమొదటిసారి నటించారు. ఆ సినిమా పేరు "మంచి మిత్రులు". ఇది అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ అయ్యింది. అదే సంవత్సరం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కృష్ణ, విజయనిర్మల వివాహం జరిగింది. 1970వ సంవత్సరంలో పద్మాలయ బ్యానర్ స్థాపించి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఈ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం 'అగ్నిపరీక్ష' విడుదలైంది. ఇదే సంవత్సరంలో ద్వితీయ కుమార్తె మంజుల జన్మించింది.
 
 
ఇక 1971వ సంవత్సరం కృష్ణ సీని చరిత్రలో సువర్ణాధ్యాయం అని చెప్పచ్చు. హాలీవుడ్ స్ధాయిలో నిర్మించిన కౌబోయ్ చిత్రం "మోసగాళ్లకు మోసగాడు". ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాని పరిచయం చేసిందని చెప్పచ్చు. అందుకనే... ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు కౌబోయ్ హీరోగా కృష్ణకు అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టింది. 
 
ఇక 1972వ సంవత్సరంలో పద్మాలయ సంస్థ నిర్మించిన 'పండంటి కాపురం' గోల్డన్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. ఇదే సంవత్సరంలో కృష్ణ 18 చిత్రాలలో హీరోగా నటించి ప్రపంచ స్ధాయిలో రికార్డు సృష్టించారు. ఇప్పటికీ ఇది రికార్డుగా నిలవడం విశేషం.
 
1973వ సంవత్సరంలో ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణ నటించారు. ఆ భారీ మల్టీస్టారర్ మూవీయే 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌పై కృష్ణ నిర్మించారు. ఇది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 1974వ సంవత్సరంలో కృష్ణ నటించిన 100వ చిత్రం 'అల్లూరి సీతారామరాజు' రిలీజైంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇది తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రంగా నిలిచింది.

ఇదే సంవత్సరం విజయనిర్మల విజయకృష్ణా మూవీస్ సంస్థ ప్రారంభించారు. మరో విశేషం ఏంటంటే... అభిమానుల యువరాజు... అశేష ప్రేక్షకుల రారాజు... 75 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను బ్రేక్ చేసిన 'పోకిరి' అదేనండి... హీరో కృష్ణగారి ద్వితీయ పుత్రుడు ప్రిన్స్ మహేష్ బాబు జన్మించారు.
 
1975వ సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వంచే స్వర్ణ నంది బహుకరణ జరిగింది. ఇదే సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలకు విరాళం ఇవ్వటం జరిగింది. ఇక 1976వ సంవత్సరంలో పద్మాలయ బ్యానర్‌పై తొలిసారిగా నిర్మించిన కన్నడ చిత్రం 'సూత్రదబొందె' విడుదలయ్యింది.

గ్రామీణ, రైతు నేపధ్యంలో నిర్మించిన "పాడిపంటలు" చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తెలుగు చిత్రసీమలో భారీ ఖర్చుతో అద్భుతమైన టెక్నికల్ విలువలతో నిర్మించిన పౌరాణిక చిత్రం 'కురుక్షేత్రం'. ఈ చిత్రం 1977లో విడుదలైంది. ఈ చిత్రం కర్నాటకలో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. 
 
1978వ సంవత్సరంలో కృష్ణ నటించిన 'అన్నదమ్ముల సవాల్', 'ఏజెంటు గోపీ', 'కుమారరాజ' చిత్రాలు మంచి విజయం సాధించాయి. 1979వ సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'ఏజెంటు గోపీ', 'ఇంద్రధనుస్సు' చిత్రాలు ప్రదర్శించారు. పద్మాలయ సంస్థలో తెలుగుతో పాటు హిందీ చిత్రాలు కూడా నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన మొదటి హిందీ చిత్రం "టక్కర్". ఈ సినిమా 1980వ సంవత్సరంలో విడుదలలైంది.

1981వ సంవత్సరంలో కృష్ణ నటించిన "ఊరికి మొనగాడు" రిలీజైంది. ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకుని సూపర్ హిట్ అయ్యింది. అదే సంవత్సరం కృష్ణ - ఇందిరా దేవి దంపతులకు తృతీయ కుమార్తె ప్రియదర్శిని జన్మించారు.
 
కృష్ణ నటించిన 200వ చిత్రం "ఈనాడు". అప్పట్లో 'ఈనాడు' సినిమా ఓ సంచలనం. ఈ సినిమా 1982వ సంవత్సరంలో రిలీజైంది. ఇదే సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి భనవం వెంకట్రామిరెడ్డిచే హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియో శంఖుస్థాపన చేశారు. 1983వ సంవత్సరంలో కృష్ణ నటించిన ఆరు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

పద్మాలయ స్టూడియో ప్రారంభం జరిగింది. పద్మాలయ వారి హిందీ చిత్రం "హిమ్మత్ వాలా" రజతోత్సవ వేడుకలు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. 1984లో కృష్ణ నటించిన 'ఇద్దరు దొంగలు' చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక 1985లో సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో గోల్డెన్ ఇయర్. ఈ ఇయర్లో 'అగ్నిపర్వతం', 'పల్నాటి సింహం', 'వజ్రాయుధం' వంటి చిత్రాలు సూపర్ హిట్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
 
1986వ సంవత్సరంలో కృష్ణ తొలిసారి కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి తెలుగు, హిందీ భాషలలో నిర్మించిన తొలి 70 ఎమ్ఎమ్ చిత్రం "సింహాసనం". అత్యంత భారీ బడ్జెట్‌గా రూపొందిన 'సింహాసనం' సూపర్ హిట్ అయ్యింది. ప్రముఖ సినిమా పత్రిక 'జ్యోతిచిత్ర' నిర్వహించిన సూపర్ స్టార్ బ్యాలెట్‌లో వరుసగా 5 సార్లు సూపర్ స్టార్‌గా ఎన్నికై సూపర్ స్టార్ కృష్ణ రికార్డు సృష్టించారు. 
 
1987వ సంవత్సరంలో 'ముద్దాయి' చిత్రం విడుదలై విజయం సాధించింది. ఇక 1988వ సంవత్సరంలో కృష్ణ స్వీయ దర్శకత్వంలో కృష్ణ, రమేష్‌, మహేష్ నటించిన 'కొడుకు దిద్దిన కాపురం' రిలీజైంది. ఒకే చిత్రంలో ఇలా తండ్రీ కొడుకులు నటించడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సూపర్ హిట్ అయ్యింది.
 
సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1989వ సంవత్సరంలో కృష్ణ తొలిసారిగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఇక 1990 వ సంవత్సరంలో కృష్ణ నటించిన 'నాగాస్త్రం', 1991వ సంవత్సరంలో "నా ఇల్లే నా స్వర్గం" చిత్రాలు సక్సస్ సాధించాయి. 1992వ సంవత్సరంలో కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి వివాహం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. 1993వ సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన "పచ్చని సంసారం" విజయంతో కృష్ణకు పూర్వవైభవం వచ్చిందని చెప్పచ్చు.
 
1994వ సంవత్సరంలో విడుదలైన 'నెంబర్ వన్' చిత్రం సంక్రాంతి చిత్రాలలో నెంబర్ వన్ హిట్ అయి కృష్ణకు కొత్త ఇమేజ్ తేవడమే కాకుండా మరింత గ్లామర్ హీరోగా పేరు తెచ్చింది. 1995వ సంవత్సరంలో 'అమ్మదొంగ' చిత్రం సూపర్ హిట్ అయ్యింది. మరలా సంక్రాంతి 'మొనగాడు'గా కీర్తింపబడ్డారు.

ఇదే సంవత్సరం కృష్ణ నటించిన 300వ చిత్రం "తెలుగు వీర లేవరా" విడుదలయ్యింది. 1996వ సంవత్సరంలో కృష్ట నటించి 'జగదేకవీరుడు', 'సంప్రదాయం' చిత్రాలు విడుదలై సక్సస్ సాధించాయి. 1997వ సంవత్సరంలో కృష్ణ నటించిన 'ఎన్‌కౌంటర్' చిత్రం కమర్షియల్ సక్సస్ సాధించింది.
 
1999లో కృష్ణ ద్వితీయ కుమారుడు మహేష్‌ బాబు 'రాజకుమారుడు' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో కృష్ణ ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుని మహేష్ బాబుకి తొలి విజయాన్ని అందించింది. 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో కలిసి కృష్ణ "వంశీ" చిత్రంలో నటించారు.

ఆతర్వాత 2001లో కృష్ణ నటించిన "పండంటి సంసారం" విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. 2003 గుంటూరులోని దాసరి కల్చరల్ అకాడమీ వారు కృష్ణ, విజయనిర్మలను లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించారు.
 
2004లో నానక్ రామ్ గూడలోని ప్లానెట్ 10లో అత్యద్భుతంగా నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశం జరిగింది. ఇదే సంవత్సరంలో జీసెస్ ప్రధాన పాత్రగా 'శాంతి సందేశం' చిత్రంలో కృష్ణ నటించారు. ఇక 2005లో కృష్ణ హీరోగా నటించిన 'ఎవరు నేను', 'సి.బి.ఐ ఆఫీసర్', 'శ్రావణమాసం' చిత్రాలు విడుదల అయ్యాయి. 2006లో హైదరాబాద్‌లోని సైబర్ గార్డెన్స్‌లో కృష్ణ తృతీయ కుమార్తె ప్రియదర్శిని వివాహం అత్యంత వైభవంగా జరిగింది. 2007 సంవత్సరంలో ముంబైలోని స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు ఈ శతాబ్దపు ఉత్తమ జంటగా కృష్ణ, విజయనిర్మలను ఘనంగా సత్కరించారు.
 
2009లో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు ఎప్పుడో రావాలి.. ఆలస్యంగా అయినా సరే.. ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు ప్రకటించడంతో ఆయన అభిమానుల ఆనందం వ్యక్తం చేశారు. 2019లో జూన్ 27న  కృష్ణ సతీమణి విజయనిర్మల మరణించారు. ఎప్పుడూ కృష్ణ వెన్నంటే ఉండే విజయనిర్మల వెళ్లిపోవడంతో అప్పటి నుంచి కృష్ణ ఇంటికే పరిమితం అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో... సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సంచలనాలు సృష్టించి.. చరిత్ర సృష్టించారు. ఆయన నిండూ నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ... హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్..!