గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:28 IST)

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 
 
ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదిని లష్కరే తాయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని కాశ్మీర్‌ జోన్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరో ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. 
 
గురువారం మధ్యాహ్నం కుల్గామ్‌లో బీఎస్‌ఎఫ్‌ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ముష్కరుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు శుక్రవారం తెల్లవారుజామున గాలింపు బృందాలపై కాల్పులు జరిపాయని, దీంతో దురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది హతమయ్యాడని ఐటీ వెల్లడించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.