శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:35 IST)

ఆర్మీ మేజర్ అలా మరణిస్తే.. భార్య ఏం చేసిందో తెలుసా?

పుల్వామా ఘటనలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రమూకల దాడిలో అమరులైన జవాన్ల కోసం దేశమే కంటతడి పెట్టింది. ఇలాంటి ఘటనలో భర్తను కోల్పోయిన ఓ జవాను సతీమణి.. తన భర్తను పోగొట్టుకున్న ప్రాంతంలో తానుండాలని భావించింది. అంతేగాకుండా సైన్యంలో చేరిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని విహార్ ప్రాంతానికి చెందిన గౌరీ ప్రసాద్ మహదిక్ భర్త ప్రసాద్ గణేశ్ ఆర్మీ మేజర్‌గా సేవలు అందించారు. భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ 2017లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండేళ్లకే భర్తను కోల్పోవడంతో గౌరీ కలల ప్రపంచం తల్లకిందులైంది. అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు. 
 
అప్పటి వరకు తాను పనిచేస్తున్న ఓ కంపెనీకి రాజీనామా చేసి సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే సంవత్సరం పూర్తయ్యేలోపు ఆర్మీ ఉద్యోగం సంపాదించి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడుగుపెడుతున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను న్యాయవాదిగా.. ఓ కంపెనీలో సెక్రటరీగా ఎలాంటి లోటు లేకుండా ఉద్యోగం చేశాను. కానీ భర్త మరణించాక ఉద్యోగం వదిలేసి ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నానని... తద్వారా తన భర్తకు నిజమైన నివాళి అర్పించేందుకు సిద్ధమైనట్లు ఆమె వెల్లడించారు. సైన్యంలో ట్రైనింగ్ పూర్తయ్యాక తాను ధరించబోయే యూనిఫామ్‌లో తన భర్తను చూసుకుంటానని చెప్పింది.
 
గతేడాది జరిగిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) పరీక్షలో గౌరి మహదిక్ (31) ఎంపికయ్యారు. విడో కేటగిరీ కింద రెండో ప్రయత్నంలోనే ఆమె టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నైలోని భారత ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో గౌరీ చేరనున్నారు. 49 వారాల పాటు శిక్షణ తీసుకోన్నారు. అకాడమీలో ఏడాది పాటు తప్పని సరిగా తీసుకోవాల్సిన ఈ శిక్షణ తర్వాత ఆమె లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలోకి ప్రవేశిస్తారు.