పోక్సో: సమ్మతి వయస్సును తగ్గించకండి.. లా కమిషన్
పోక్సో చట్టం కింద సమ్మతి వయస్సును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించకూడదని కేంద్ర సర్కారుకు లా కమిషన్ సూచన చేసింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనలను వ్యతిరేకించింది.
ఇందులో భాగంగా పోక్సో చట్టం, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు 22వ లా కమిషన్ నివేదికలను అందజేసింది.
నేరాలకు పాల్పడుతున్న వారి వయస్సును తగ్గించడం మంచిది కాదని లా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంకా సమ్మతి వయసును తగ్గిస్తే.. అది బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని లా కమిషన్ పేర్కొంది.
16-18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన ఇలాంటి కేసుల్లో.. వారు ఇష్ట పూర్వకంగానే లైంగిక కార్యకలాపాలో పాల్గొంటే.. అలాంటి కేసుల పరిష్కారానికి చట్టంలో కొన్ని సవరణలు అవసరమని న్యాయ కమిషన్ అభిప్రాయపడింది.
పోక్సో కేసుల్లో ఎక్కువ మంది నేరస్థులు పిల్లలకు తెలిసినవారు, సన్నిహితులు, కొన్నిసార్లు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులేనని ప్యానెల్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఇ-ఎఫ్‌ఎస్‌ఐఆర్ నమోదును దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రానికి లా కమిషన్ సిఫారసు చేసింది