సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఇక ప్రజ్ఞాన్ రోవర్ కథ ముగిసినట్టే ... స్పందించిన ఇస్రో చీఫ్

somnath
చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటివరకు మేల్కొనలేదు. దీంతో దాని కథ ముగిసినట్టుగానే శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే అంశంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపై ప్రయోగించిన ప్రజ్ఞాన్ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. ఇది నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదన్నారు. 
 
ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్సే‌రే పోలారిమీటర్ ఉపగ్రహ ప్రయోగంపై ప్రస్తుతం దృష్టిసారించినట్టు చెప్పారు. ఎక్స్‌పోశాట్‌తో పాటు ఇన్‌శాట్-3డీని కూడా నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రయోగించనున్నట్టు ఆయన తెలిపారు. 
 
గత ఆగస్టు నెలలో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతమైన విషయం తెల్సిందే. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత 14 రోజుల పాటు అవి తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత పక్షం రోజులుగా నిద్రాణస్థితిలో ఉన్న విక్రమ్, ప్రజ్ఞాన్‌లు ఇపుడు చంద్రుడిపై ఎండ వచ్చినప్పటికీ మేల్కొనలేదు. దీంతో వీటి కథ ముగిసినట్టుగా భావిస్తున్నారు.