శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (09:38 IST)

చందమామ పెరట్లో ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు... ఇస్రో ట్వీట్

pragyan rover
చంద్రయాన్-3 ప్రాజెక్టుకు సంబంధించిన మరో కొత్త వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో జాబిల్లి ఉపరితలంపై రోవర్ చక్కర్లు కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జాబిల్లి దక్షిణ ధృవం ఉపరితలంపై దిగిన చంద్రయాన్ -3 ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనల్లో నిమగ్నమైంది. 14 రోజుల వ్యవధిలో చంద్రుడిపై రోవర్ పూర్తి చేయాల్సిన పరిశోధనల జాబితా పెద్దగానే ఉంది. 
 
అందుకే.. జాబిల్లి ఉపరితలంపై అటూఇటూ తిరుగుతూ అన్వేషణలు సాగిస్తోంది. అయితే బండరాళ్లు, బిలాలతో నిండిన చందమామపై తాను నడవాల్సిన సురక్షిత మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇస్రో తాజాగా ట్విటర్లో ఉంచింది. సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ రోవర్ తిరుగుతుండగా ప్రజ్ఞాన్ భ్రమణాన్ని ల్యాండర్ ఇమేజర్ కెమెరా బంధించింది. 'తల్లి అప్యాయంగా చూస్తుంటే చందమామ పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది కదా వీడియో' అంటూ ఇస్రో సరదాగా రాసుకొచ్చింది.
 
ఇదిలావుంటే, జాబిల్లిపై శాస్త్రీయ పరిశోధనలు సాగిస్తోన్న చంద్రయాన్-3 పేలోడ్లు.. ఆసక్తికర సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని ఇప్పటికే చేరవేశాయి. ఈ క్రమంలోనే విక్రమ్ ల్యాండర్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సైస్మిక్ యాక్టివిటీ (ఇల్సా).. తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేసింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. 
 
ఆగస్టు 26న నమోదు చేసిన వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది. మరోవైపు, 'ఇల్సా' పేలోడ్.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ సాంకేతిక ఆధారిత పరికరం' అని ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై రోవర్, ఇతర పేలోడ్ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలను ఇల్సా ఇప్పటికే నమోదు చేసింది. అలాగే చంద్రుని ఉపరితలానికి దగ్గరలో ఆవరించి ఉన్న ప్లాస్మాపై ల్యాండర్‌లో అమర్చిన రాంభా-ఎల్పీ పరికరం తన తొలి దశ అధ్యయనాన్ని పూర్తి చేసింది. అది అక్కడ పలుచగా ఉన్నట్లు గుర్తించిందని ఇస్రో తెలిపింది.