1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (09:39 IST)

ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సర్వం సిద్ధం.. 2న శ్రీహరికోట నుంచి ప్రయోగం

aditya L1
చంద్రుడి దక్షిణ ధృవంపై అధ్యయనం నిమిత్తం చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇపుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై ప్రయోగాలకు ఆదిత్య ఎల్-1 పేరుతో ప్రయోగం చేపట్టనుంది. సూర్య మండలంపై ప్రయోగానికి ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఇందుకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వేదిక కానుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సి57 రాకెట్ ద్వారా సెప్టెంబరు 2న కక్ష్యలోకి పంపాలని నిర్ణయించింది. 
 
సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు 1500 కిలోలు కాగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.368 కోట్లు. సౌర కార్యకలాపాలు, అంతరిక్షంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. 
 
ఇందులో గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. అక్కడికి చేరుకోవడానికి ఆదిత్య ఎల్-1కు నాలుగు నెలలు పడుతుంది. సూర్యుడిని శోధించడానికి విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్ సహా ఏడు పరిశోధన పరికరాలను ఆదిత్య-ఎల్1 మోసుకెళ్లనుంది. 
 
అవి సూర్యుడిలోని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపలి పొరలు, సౌరశక్తి రేణువులు, అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. ఆదిత్య-ఎల్ లోని నాలుగు సాధనాలు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు ఎల్ ప్రదేశంలోని స్థితిగతులపై అధ్యయనం నిర్వహించనున్నాయి.