ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:01 IST)

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : మరోవారం గడ్డుకాలమే... కేసులు తగ్గితే సడలింపు...

లాక్‌డౌన్ అంశంలో దేశ ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నివృత్తి చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల లాక్‌డౌన్‌ను మరో 19 రోజులపాటు పొడగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత కరోనా కేసుల సంఖ్య నమోదులో తగ్గుదల కనిపించినట్టయితే, లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తామంటూ ప్రకటించారు. ఇది కొంతమేరకు ఊరట కలిగించే అంశమే. అయితే, ఈ నెల 20వ తేదీ వరకు దేశ ప్రజలంతా మరింత కఠినంగా ఈ లాక్‌డౌన్ నిబంధనలను పాటించాల్సివుంది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ తన ప్రసంగంలో సుస్పష్టం చేశారు. 
 
ఇకపోతే, ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో కొంత ఊరట కలిగించే విషయాలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం రెడ్‌జోన్, హాట్‌స్పాట్‌లు అమలవుతున్న ప్రాంతాల్లో 20వ తేదీ వరకూ మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 20వ తేదీ తర్వాత ఈ ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి నిబంధనల సడలింపు ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. 
 
వివిధ రాష్ట్రాల సీఎంల మాటకు విలువనిచ్చిన నరేంద్ర మోడీ, లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే, 20వ తేదీ నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. లాక్‌డౌన్ పొడిగింపు విధి విధానాలపై స్పష్టమైన ప్రకటన బుధవారం నాడు ఉంటుందని తెలిపారు.
 
ప్రధాని వ్యాఖ్యల తర్వాత 20వ తేదీని లాక్‌డౌన్‌లో ఓ 'కామా'గా భావించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, రెడ్‌జోన్, హాట్‌స్పాట్‌లో ఉన్నవారు సహకరిస్తే, మరో వారం తర్వాత కేసుల సంఖ్య తగ్గుతుందని, ఆపై పరిస్థితి మెరుగుపడితే, నిబంధనల సడలింపు ఉంటుందని, అందుకే వచ్చే వారం రోజులపాటు గడ్డుకాలంగా భావిస్తున్నారు.