గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (09:13 IST)

కారులో పెళ్ళి చేసుకున్న ప్రేమజంట... పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ

lovers in car
కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట కారులో పెళ్లి చేసుకుంది. వీరికి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో కాస్త యువతి తల్లిదండ్రుల కంటపడింది. మరోవైపు, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రేమజంట పోలీసు స్టేషన్‌కు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని పిలిచి పంచాయతీ నిర్వహించి యువతి అభిప్రాయం మేరకు భర్త వద్దకు పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బళ్లారి జిల్లాలోని సిరుగుప్ప తాలూకా తెక్కలకోటెకు చెందిన శివప్రసాద్‌ డిప్లొమా చదువుకున్నారు. కొప్పళ జిల్లాకు చెందిన అమృత డిగ్రీ చేసింది. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనా వారి పరిచయం ప్రేమకు దారితీసింది. అక్కడితో ఆగిపోకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అడ్డుకుంటున్నారని కిరాకత సినిమా మాదిరిగానే కారు వెనుక సీటులో దండలు మార్చుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి వారు మంగళవారం సాయంత్రం సిరుగుప్ప తాలూకా తెక్కలకోటె పోలీసులను సంప్రదించారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులను కూర్చోబెట్టి యువతిని అభిప్రాయాలు కోరడంతో మొదట భర్త శివప్రసాద్‌ కావాలి.
 
మళ్లీ కొద్దిసేపటికే తల్లిదండ్రులు కావాలని సమాధానం చెప్పడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. అప్పటికే రాత్రి కావడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఉంచుకోవడం మంచిది కాదని మహిళా పోలీసుల సహకారంతో మంగళవారం రాత్రి కంటోన్మెంట్‌లోని స్త్రీసేవా నికేతన్‌ సాంత్వన కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా భర్త శివప్రసాద్‌ వాహనానికి అడ్డంగా కూర్చుని అమృతను ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాను. దండలు మార్చుకోవడమే కాదు. మెడలో నల్లపూసల దండ కూడా ఉంది. తన భార్యను వెంట పంపించాలని వేడుకున్నాడు. అయితే, యువతి అభిప్రాయం మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంటామని పోలీసులు ఆమెను తీసుకెళ్లారు. 
 
చివరకు ప్రేమించి కారులోనే పెళ్లి చేసుకున్న యువ జంట ఒక్కటయ్యారు. యువతి మనసు గందరగోళంగా ఉండటంతో మంగళవారం రాత్రి బళ్లారి సాంత్వన కేంద్రంలో ఉంచారు. బుధవారం సాయంత్రం తెక్కలకోటె పోలీస్‌ స్టేషన్‌లో అమృత తల్లిదండ్రులు, శివప్రసాద్‌ తల్లిదండ్రుల మధ్య పోలీసులు పంచాయితీ చేశారు. చివరికి యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న శివప్రసాద్‌ ఇంటికే వెళ్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాల నుంచి వీడియోరికార్డ్‌ చేసుకుని అమృతను శివప్రసాద్‌ వెంట పంపారు. ఆద్యంతం సాగిన ఈ కథ చివరికి సుఖాంతమైంది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.