బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (16:24 IST)

మధ్యప్రదేశ్‌లో పండుగ వాతావరణం ... కమలనాథుల సంబరాలు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. కమలనాథులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేబీ అభ్యర్థులు 20 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీజేపీ నేతల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మొరెనా నియోజకవర్గంలో బీఎస్పీది పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌లో తమదే హవా కావడంతో మధ్యప్రదేశ్ బీజేపీ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో మిఠాయిలు పంచుకుంటూ నేతలు, కార్యకర్తలు వేడుకలు షురూ చేశారు.
 
అయితే, మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారులోని ముగ్గురు మంత్రులు తమ ప్రత్యర్థులకన్నా వెనుకబడి ఉండటం గమనార్హం. సుమావోలి నియోజకవర్గంలో ఐదాల్ సింగ్ కన్సానా, దిమాని నియోజకవర్గంలో గిరిరాజ్ దండోత్, మెహగావ్ నియోజకవర్గంలో ఓపీఎస్ భదోరియా వెనుకంజలో ఉన్నారు. అటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింథియా ఆధిక్యంలో ఉన్నారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత జ్యోతిరాదిత్యం సింధియా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో విభేదించి తన వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. వీరింతా తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. అలాగే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెంద‌డంతో.. మొత్తం 28 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. వీరిలో 12 మంది మంత్రులు ఉన్నారు. 
 
అయితే ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా వ‌స్తాయ‌నేది ఉత్కంఠ‌గా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉండ‌గా, మ్యాజిక్ ఫిగ‌ర్ వ‌చ్చేసి 116. అయితే ఈ ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ 9 స్థానాలు గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి. లేనిప‌క్షంలో అధికారం కోల్పోయే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం భాతర‌తీయ జ‌న‌తా పార్టీకి 107 మంది స‌భ్యుల బ‌లం ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీకి 87 మంది స‌భ్యుల బ‌లం ఉంది.