శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (08:38 IST)

మహారాష్ట్ర ఎన్నికలు : ముగిసిన ప్రచారం.. 19న పోలింగ్ - ఉద్ధవ్‌ - రాజ్ ఠాక్రేలకు లిట్మస్ టెస్ట్!!

maharashtra politics
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. ఈ నెల 19వ తేదీ బుధవారం పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. గత కొన్ని రోజులుగా ఈ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), బీజేపీలు కలిసి మహాయుతి పేరుతో ఎన్నికల బరిలోకిదిగాయి. 
 
మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా, బీజేపీ అత్యధికంగా 152 స్థానాలకు పోటీ చేస్తోంది. అలాగే, బీజేపీకి చెందిన మరో 19 మంది అభ్యర్థులు ఎన్సీపీ, శివసేన టికెట్లపై పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ - 58, ఏక్‌నాథ్ పిండే నేతృత్వంలోని శివసేన 81 సీట్లకు పోటీ చేస్తున్నాయి. 
 
అలాగే, మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అత్యధికంగా 102, ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన 96, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేస్తున్నాయి. బీజేపీతో కాంగ్రెస్ 16 చోట్ల నేరుగా తలపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కుల, మత రాజకీయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 
 
హిందువులంతా కలిసికట్టుగా ఓటు వేయాలని, ఓట్లు చీలకూడదని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఏక్ హైతో సేఫ్ హై, బటింగేతో కటింగే పేరిట ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రం హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ప్రచారం చేశారు. 
 
మరోవైపు, అదానీ ఒక్కడికే అన్నీ దక్కాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని, అందుకే ఏక్ హైతో సేఫ్లై అని నినాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ముందు మహిళల కోసం మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రకటించిన లాడ్లీ బెహనా యోజన గేమ్ చేంజర్ మారనున్నదని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ ఎన్నికలు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలకు లిట్మస్ టెస్టులుగా మారింది.