సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మహారాష్ట్రలో మరో సాధువు హత్య.. 40 రోజుల్లో రెండో మర్డర్

శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ కూటమి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో మరో సాధువు హత్యకు గురయ్యాడు. ఈ రాష్ట్రంలో గత 40 రోజుల్లో సాధువులు హత్యకు గురికావడం ఇది రెండో ఘటన. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, నాందేడ్‌ జిల్లాలోని ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని కూడా హత్య చేశారు. ఇద్దరి మృత దేహాలూ స్నానాల గదిలో పడేశారు. ఇద్దరినీ గొంతుకోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ హత్యల తర్వాత డబ్బు, బంగారం దోచుకుని పారిపోతుండగా హంతకుడిని స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే హంతకుడు దొరక్కుండా పారిపోయాడు. హత్యకు గురైన ఆశ్రమంలోనే శివచార్య చాలా కాలంగా ఉంటున్నారని భక్తులు తెలిపారు.   
 
కాగా, గత నెల 16వ తేదీన పాల్‌ఘర్‌‌లో వంద మందికి పైగా సాయుధులు ఇద్దరు సాధువులపై సామూహిక దాడి చేసి చంపేశారు. ఇంతలోనే మహారాష్ట్రలో మరో సాధువు హత్య జరగడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఉద్ధవ్ పాలనలో సాధువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే హంతకులను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.