సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మే 2020 (21:25 IST)

ముఖ్యమంత్రి గండం నుంచి గట్టెక్కిన ఉద్ధవ్ ఠాక్రే!

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పెద్ద గండం నుంచి గట్టెక్కారు. ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకాలేదు. దీనికి కారణం ఆయన శాసనమండలి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఆయన ఏ సభలోను సభ్యుడు కాదు. పైగా, సీఎం లేదా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్నెల్లలోపు ఏదోని ఒక సభకు ఎంపిక కావాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆయన సీఎం పదవి చేపట్టి ఈ నెల 27వ తేదీతో ఆర్నెల్ల గడువు ముగియనుంది. ఈ పరిస్థితుల్లోనే ఆయన శాసనమండలి సభ్యుడుగా ఎంపికయ్యారు. 
 
ఇక ఆయనతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర సభ్యుల్లో శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలం గోర్హే (శివసేన), బీజేపీ నుంచి రంజిత్ సింగ్ మోహితే పాటిల్, గోపీచంద్ పడాల్కర్, ప్రవీణ్ డాట్కే, రమేశ్ కరాడ్, ఎన్సీపీ నుంచి శశికాంత్ షిండే, అమోల్ మిత్కారీ, కాంగ్రెస్ నుంచి రాజేశ్ రాథోడ్ ఉన్నారు.
 
మండలిలో ఈ తొమ్మిది స్థానాలు ఏప్రిల్ 24న ఖాళీ అయ్యాయి. ఈ తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమయం ముగిసింది. ఆ వెంటనే వీరంతా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.
 
ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో... శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే శాసనకర్తగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి దివంగత బాల్ ఠాక్రే కూడా తన జీవితంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ సారి మాత్రం ఉద్ధవ్, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే (ఎమ్మెల్యే) ఒకేసారి శాసనకర్తలుగా ఎన్నికయ్యారు. గత ఏడాది నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, ఎమ్మెల్సీగా ఉద్ధవ్ ఎన్నిక కావడంతో శివసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.