ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (19:31 IST)

ఏం చేద్ధాం... దుకాణం బంద్ చేద్దామా? మీరే ఓ మాట చెప్పండి...

రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కమల్ పోటీ చేసిన కోయంబత్తూరు దక్షిణం స్థానంలో కూడా ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ  ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ రాజీనామా చేశారు. తనతో పాటు మరో ఆరుగురినీ ఆయన తీసుకెళ్లారు. అదేసమయంలో పార్టీ అధినేత కమల్ హాసన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. 
 
ఈ క్రమంలో కమల్ దిద్దుబాటు చర్యలకు దిగారు. మనసులో మాట చెప్పాలంటూ పార్టీ కార్యకర్తలను కోరారు. ఏమనుకుంటున్నారో తనకు మెయిల్ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వివాదాలు వచ్చాయని, పరిస్థితులు మారాయని పార్టీ సిద్ధాంతాలను, లక్ష్యాలను మార్చలేమన్నారు. 
 
తొలిసారి అసెంబ్లీ ఎన్నికలనే పెద్ద యుద్ధంలో బరిలోకి దిగి సమర్థంగా పోరాడామని ఈ సందర్భంగా కమల్ హాసన్ గుర్తుచేశారు. అయితే, ఆ పోరులో వెన్నుపోటుదారులు, శత్రువులు ఎంతో మందిని ఎదుర్కొన్నామన్నారు. ఆ జాబితాలో మహేంద్రన్ ముందుంటారని చెప్పుకొచ్చారు. 
 
అతడి అసమర్థతను వేరే వారిపై రుద్దేందుకు చూస్తున్నారన్నారు. ఓటమితో దిగులు చెందొద్దని కార్యకర్తలకు సూచించారు. పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులను గుర్తించి బయటకు పంపించి.. పార్టీకి పునరుత్తేజం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, 234 స్థానాలకుగానూ 154 స్థానాల్లో కమలహాసన్ పార్టీ బరిలో నిలిచింది.