శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (16:18 IST)

నాకూ నిరాశగానే వుంది.. కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే... కమల్ హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటుపై ఓ స్పష్టత ఇచ్చారు. తాను అనారోగ్యంతో ఉన్నాననీ, అందువల్ల పార్టీ పెట్టలేనని క్లారిటీ ఇచ్చారు. ఇది కోట్లాది మంది రజనీ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు లోనుచేసింది. అలాంటి వారిలో రాజకీయ నేతగా మారిన సినీ నటుడు కమల్ హాసన్ కూడా పెదవి విరిచారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో పార్టీని స్థాపించి విస్తృతంగా పర్యటిస్తున్న కమల్ హాసన్.. ఇపుడు రజనీకాంత్ నిర్ణయంపై స్పందించారు. పార్టీ పెట్ట‌కూడ‌ద‌న్న ర‌జ‌నీకాంత్ నిర్ణ‌యం ఆయ‌న అభిమానుల‌లాగే త‌న‌నూ తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌న్నారు. అయితే ఆయ‌న ఆరోగ్య‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని తేల్చి చెప్పారు. 
 
అలాగే, త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌ను క‌లుస్తాన‌ని క‌మ‌ల్ చెప్పారు. ర‌జ‌నీ పార్టీ పెడుతున్నార‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీతో పొత్తుపై గ‌తంలో క‌మ‌ల్ స్పందించారు. కేవ‌లం ఒక ఫోన్ కాల్ చేస్తే స‌రిపోతుంద‌ని, త‌మ ఇద్ద‌రి సిద్ధాంతాలు ఒక‌టే అయితే అహాల‌ను ప‌క్క‌న పెట్టి క‌లిసి ప‌ని చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్లు క‌మ‌ల్ అప్ప‌ట్లో ప్రకటించి సంచలనం సృష్టించారు. కానీ, రజనీ నిర్ణయం ఇపుడు కమల్ హాసన్‌ ఆశపై నీళ్ళు చల్లినట్టయింది. 
 
ఇకపోతే, తమ పార్టీ ఆధ్వర్యంలో ఓ కూటమి ఏర్పాటు కానుందని, ఆ తృతీయ కూటమి నుంచి తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం భావసారూప్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, వచ్చే నెలలో ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందన్నారు. 
 
తన ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. తన ప్రచారానికి వస్తున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో లంచం ఇవ్వకుండా ఏ పనీ జరగడం లేదని ఆరోపించారు. చివరికి జనన ధ్రువీకరణ పత్రానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి కంప్యూటర్ అందజేస్తామని కమల్ హామీ ఇచ్చారు. అయితే, అవి ఉచితం కాదని, ప్రభుత్వ పెట్టుబడిగా మాత్రమేనని చెప్పారు. రైతును గౌరవించని దేశం అభివృద్ధి చెందదన్న కమల్.. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదన్నారు. పార్టీ గుర్తు టార్చిలైట్ కోసం అవసరమైతే కోర్టుకు వెళ్తామని కమల్ ప్రకటించారు.