గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2022 (13:56 IST)

కలిసి బతుకుదామని నమ్మించి కోర్టు హాలులోనే భార్య గొంతుకోసిన భర్త

knife
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కలిసి జీవిద్దామని భార్యను నమ్మించి కోర్టుకు తీసుకొచ్చిన ఓ కసాయి భర్త... కోర్టు హాలులోనే భార్య గొంతు కోశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని హలెనరసిపుర ఫ్యామిలీ కోర్టులో జరిగింది. పైగా, ఈ భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులు కావడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లాకు చెందిన శివకుమార్, చైత్ర అనే మహిళకు ఏడేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
ఈ క్రమంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, వారికి కౌన్సెలింగ్ ఇచ్చింది. విభేదాలు పరిష్కరించుకుని, కలిసి జీవించాల్సిందిగా సూచించారు. కౌన్సెలింగ్ సెషన్‌లో చెప్పిన ప్రతి మాటకు సమ్మతించారు. 
 
కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చైత్ర బాత్రూమ్‌కు వెళుతుండగా, శివకుమార్ ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, కోర్టులో ఉన్న ఇతరులు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అలాగే, రక్తపుమడుగులో ప్రాణాపాయస్థితిలో ఉన్న చైత్రను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు.