1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (17:57 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : మనీశ్ సిసోడియాకు బెయిల్ నిరాకరణ

Manish Sisodia
ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. మద్యం కేసులో అరెస్టయిన మనీశ్‌ సిసోదియాకు జ్యుడీషియల్‌ కస్టడీని విధిస్తూ ఢిల్లీ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 24న విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. 
 
తాజాగా బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 3 వరకు ఈ కస్టడీ కొనసాగనుంది. ఇప్పటికే నెల రోజులకు పైగా జైలులోనే ఉంటున్నందున తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా సిసోడియా రౌస్‌ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
 
ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. 
 
ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆయనను తిహార్ జైలుకు తరలించారు. ఆ కస్టడీ కూడా ముగియడంతో సిసోడియాను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని, అందువల్ల ఆయనను మరికొన్ని రోజుల పాటు కస్టడీలోనే ఉంచాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. దీంతో సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పొడిగించింది.