చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు భగత్ సింగ్ పేరు : ప్రధాని మోడీ
చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్‌సింగ్ ఎయిర్‌పోర్టుగా మార్చనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ 93వ ఎడిషన్‌లో దేశ ప్రజలనుద్దేశించి ఆలిండియా రేడియోలో మాట్లాడారు. మొహాలీ - చండీగఢ్ ఎయిర్‌పోర్టు పేరును షాహీద్ భగత్‌సింగ్ ఎయిర్‌పోర్టుగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు.
మొహాలీ-చండీగఢ్ ఎయిర్‌పోర్టు పేరును షాహీద్ భగత్‌సింగ్ ఎయిర్‌పోర్టుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తామే కోరామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. హర్యానాకు చెందిన పౌరవిమానయాన శాఖ మంత్రి దుశ్యంత్ చౌతాలా, తాను సంయుక్తంగా ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాశామని మాన్ గుర్తు చేశారు.
ఈ నెల 28న భగత్‌సింగ్ జయంతి ఉందని, ఆలోపే ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టాలని లేఖలో కోరినట్లు భగవంత్ మాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ఎయిర్‌పోర్టుకు భగత్‌సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.