నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఆ రాష్ట్రంలోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంబవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25మంది వరకు గాయపడ్డారు. మృతిచెందిన వారంతా పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది కావడం గమనార్హం.
ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటం చోటుచేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి 11.22 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో పార్కింగ్‌లో ఉన్న పలువాహనాలకు మంటలు అంటుకున్నాయి.
ఇదిలావుంటే, హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీస్తుండగా విస్ఫోటం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయినవారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మృతదేహాలను తరలించారు.
భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటుచేసుకోవడంతో రెస్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఘటనపై ప్రకటన చేయాల్సి ఉంది.