శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

తిరుచ్చి లలిత జువెలరీలో భారీ చోరీ

తమిళనాడులోని తిరుచ్చిలోని లలిత జువెలరీ షోరూమ్‌లో అత్యంత సినీఫక్కీలో బుధవారం తెల్లవారుజామున ఈ భారీ దోపిడీ జరిగింది. గత కొన్నేళ్లలో తమిళనాడులో జరిగిన అతి పెద్ద చోరీ ఇదే. విషయం తెలిసిన వెంటనే లలిత జువెలరీ అధినేత కిరణ్‌కుమార్‌ తిరుచ్చికి వెళ్లి, షోరూమ్‌ను పరిశీలించారు.

బంగారు నగలతోపాటు వజ్రాలు, ప్లాటినంతో తయారుచేసిన ఆభరణాలు చోరీకి గురయినట్టు గుర్తించారు. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తిరుచ్చి సత్రం బస్టాండు సమీపంలో ఉన్న లలిత జువెలరీ షోరూమ్‌ని రోజూలాగానే బుధవారం ఉదయం తెరిచారు. షోరూమ్‌ లోపల ఖాళీగా ఆభరణ బాక్సులు కనిపించేసరికి నిర్వాహకులు, సిబ్బంది దిగ్ర్భాంతికి గురయ్యారు.

వెంటనే తిరుచ్చి నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుచ్చి నగర జాయింట్‌ పోలీసు కమిషనర్‌ మయిల్‌వాహనన్‌ సారథ్యంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకుని విచారణ చేపట్టింది. ఆధారాల కోసం ఫోర్సెన్సిక్‌ నిపుణులు చోరీ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు.

పరిసర ప్రాంతాల్లో జాగిలాలతో తనిఖీ చేశారు. షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా వేకువజామున 2.30 నుండి ఉదయం 4.30 గంటల మధ్య షోరూమ్‌లో రెండు అగంతకులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, వారు తమ చేతి వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్తపడ్డారు.

దోచుకున్న నగలను ఏ మార్గంలో, ఏ వాహనంలో తరలించారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే షోరూమ్‌లో పనిచేస్తున్న 160 మందికిపైగా సిబ్బంది వద్ద కూడా విచారణ జరుపుతున్నారు.
 
గతేడాది తిరుచ్చి 1వ నంబరు టోల్‌గేట్‌ సమీపంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కూ ఇదే రీతిన కన్నం వేయడం గమనార్హం. అప్పుడూ బ్యాంకు గోడకు కన్నం వేసి అగంతకులు లోపలకు ప్రవేశించారు. లాకర్‌లోని రూ.5 కోట్ల విలువైన నగలను అపహరించారు.

ఆ ఘటన, లలిత జ్యువెలర్స్‌లో దోపిడీ జరిగిన విధానం ఒకేలా ఉన్నాయని, ఆ అగంతకులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా తమిళనాడులోని తేని జిల్లాలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో 280 సవర్ల నగలు, నగదును అగంతకులు దోచుకొన్నారు.