మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (14:18 IST)

తప్పిపోయిన కమిషనర్ పెంపుడు కుక్క - 500 మంది పోలీసులతో గాలింపు

dog
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఓ విధంగా జరిగిందో రుజువు చేసే ఓ ఘటన జరిగింది. తప్పి పోయిన కమినర్ శునకం కోసం ఏకంగా 500 మంది పోలీసులు తమ రోజువారీ విధులను పక్కనబెట్టి.. ఆ శునకం కోసం విస్తృతంగా గాలించారు. ఇందుకోసం 36 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఏకంగా వందల సంఖ్యలోని గృహాలను గాలించారు. ఈ ఘటన రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగు చూసింది. 
 
ఇంతకీ ఒక్క కుక్క కోసం పోలీసులు ఇంతలా ఎందుకు కష్టపడ్డారు? అదేమైనా పోలీసు జాగిలమేమో అనుకుంటున్నారా? అది మీరట్ పోలీస్‌ కమిషనర్‌ సెల్వకుమారి పెంచుకునే పెంపుడు శునకం మరీ. మున్సిపల్‌ రికార్డుల ప్రకారం ఆ శునకం జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందినది. దాని పేరు ఎకో. ఆ జాతికి చెందిన కుక్కలు నగరంలో 19 మాత్రమే ఉన్నాయి. 
 
ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ శునకం తప్పిపోయిందట. దీంతో పోలీసు సిబ్బంది హుటాహుటిన కమిషనర్‌ నివాసానికి వెళ్లి ఆ ప్రాంతంలోని  500లకు పైగా ఇళ్లు గాలించారని కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేకాదు.. జంతువుల సంరక్షణాధికారి హర్పల్ సింగ్‌ సైతం కమిషనర్‌ ఇంటికి చేరుకుని, కుక్క ఫొటోను తీసుకుని వెతికారట. దీంతో ఈ ఘటన కాస్తా వివాదాస్పదంగా మారింది.
 
అయితే ఈ వార్తలను పోలీసు కమిషనర్‌ సెల్వకుమారి ఖండించారు. తమ శునకం కోసం పోలీసులు వెతకలేదని వెల్లడించారు. 'తప్పిపోయిన నా పెంపుడు కుక్క గురించి కొన్ని కథనాలు వస్తున్నాయి. గేట్‌ తెరచి ఉండటంతో అది బయటికి వెళ్లిపోయింది. మా నివాసానికి సమీపంలోనే అది తిరగడాన్ని గమనించిన కొందరు దాన్ని తిరిగి మా ఇంటికి తీసుకువచ్చారు. అంతేకాని దాన్ని ఎవరూ దొంగిలించలేదు. దాని కోసం పోలీసులు వెతకలేదు' అంటూ కమిషనర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.