కేరళ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఒకటి. ఈ ఎన్నికల్లో పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులోభాగంగా, పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకుంటుంది. అలాంటివారిలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఒకరు.
అయితే, తమ పార్టీ తరపున కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదించాలన్న నిర్ణయానికి వచ్చింది. మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు అందుకున్న రిటైర్డ్ ఇంజినీర్ శ్రీధరన్ కేరళలో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థి కానున్నారు. ఈ మేరకు కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ వెల్లడించారు.
88 ఏళ్ల శ్రీధరన్ ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చీరావడంతోనే సీఎం పదవిపై ఆసక్తి ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తే బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. గవర్నర్ పదవిపై ఆసక్తి లేదన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం 16 మంది సభ్యుల ఎన్నికల కమిటీలో శ్రీధరన్‌కు స్థానం కల్పించింది.
శ్రీధరన్ రాక కేరళలో బీజేపీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే వేళ్లూనుకుని ఉన్న వామపక్ష, కాంగ్రెస్ కూటములను ఎదుర్కొనేందుకు ఈసారి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే వివాద రహితుడైన శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తెచ్చినట్టు అర్థమవుతోంది.