సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (16:39 IST)

భానుడి భగ భగకు బైబై.. కేరళను తాకిన రుతుపవనాలు

Kerala
ఎండలు భగ్గుమంటున్న తరుణంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. ఐఎండి అంచనా కంటే రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. జూన్ 1న రుతుపవనాల రాక గురించి ఐఎండి రెండు రోజుల కిందట ప్రకటన చేసింది. ఈసారి రుతుపవనాలు సగటున ఉండబోతున్నాయని వాతావరణ శాఖ ఏప్రిల్‌లో తెలిపింది. 
 
ఈసారి 96 నుండి 100 శాతం వర్షపాతం నమోదైతే సాధారణ రుతుపవనాలుగా పరిగణించబడుతుంది. గతేడాది ఎనిమిది రోజుల ఆలస్యంతో జూన్ 8న కేరళ తీరాన్ని తాకాయి.. జూన్, సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల ద్వారా భారతదేశంలో వర్షాలు కురుస్తాయి.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో శనివారం నుంచి తగ్గుముఖం ఉష్ణోగ్రతలు పట్టనున్నాయి. దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. జూన్ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు వస్తాయని, జూన్ 9 , 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.