శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కుక్క జాకీకు ఆస్తి రాసిచ్చిన రైతు .. కొడుకు కంటే కుక్కే నయమట!

సాధారణంగా.. తమ పిల్లలు బాగుండాలని తాము సంపాదించిన ఆస్తిని తల్లిదండ్రులు నలుగురుకి పంచుతుంటారు. కానీ ఈ రైతు మాత్రం కన్న కొడుకు కంటే.. తాను పెంచుకునే కుక్కేనే గొప్పగా భావించాడు. అంతే.. తన యావదాస్తిని ఆ శునకం పేరుమీద రాశాడు. ఏకంగా తన 18 ఎకరాల పొలాన్ని కుక్కతో పాటు కట్టుకున్న భార్య పేరుమీద రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ వార్త ఇపుడు సోషలో మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారాలో ఓం నారాయణ వర్మ అనే రైతుకు సుమారు 18ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న నారాయణకు వయస్సు మీదపడడంతో శరీరం సహకరించడం లేదు. దీంతో తనని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్లకి తన ఆస్తి రాసిస్తానని ముందుగానే ప్రకటించాడు. 
 
అయితే అందుకు కొడుకు అంగీకరించలేదు. పైగా ఆస్తి మొత్తం తమ పేరుమీద రాయాలంటూ బలవంతం చేయసాగాడు. ఇదేవిషయంపై పలుమార్లు తండ్రీకొడుకుల మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో కొడుకు తీరుతో విసిగిపోయిన రైతు నారాయణ.. తన పెంపుడు కుక్క జాకీ పేరు మీద కొంత ఆస్తి, మిగతా భూమిని తన రెండో భార్య చంపాకు రాసిచ్చాడు. 
 
ఈ సందర్భంగా భార్య మరియు నా పెంపుడు కుక్క మాత్రమే నన్నుజాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకవేళ నేను చనిపోతే నా ఆస్తిని భార్య, కుక్క వారసత్వంగా పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక కుక్క జాకీని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్లు ఆ కుక్కకు కేటాయించిన ఆస్తి వారసత్వంగా పొందుతారని ఆ వీలునామాలో పేర్కొన్నారు.
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్... నారాయణకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. రైతు మాత్రం వయస్సు రిత్యా తనని చూసుకోవాలని కొడుకును కోరిన పట్టించుకోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. 
 
దీంతో గ్రామ సర్పంచ్ తల్లిదండ్రులు తమ ఆస్తుల్ని పంచే విషయంలో కొడుకులు అసహనం ప్రదర్శించకూడదని, తండ్రిని బాగా చూసుకొని ఆస్తిని కోరడంలో తప్పులేదని, తండ్రిని పట్టించుకోకుండా ఆస్తి విషయంలో గొడవపడితే ఎవరైనా ఇలాగే చేస్తారని కొడుకుని గట్టగా హెచ్చరించాడు. అలాగే, కుక్కపై రాసిన ఆస్తి వీలునామాను నారాయణ వెనక్కి తీసుకునేలా చేశాడు.