గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (09:24 IST)

నాన్నా చనిపోతున్నా.. ఆ లెక్చరర్‌ను వదలొద్దు : ఢిల్లీలో తెలుగు విద్యార్థి సూసైడ్

'నాన్నా ఆ లెక్చరర్ ధన దాహానికి నేను బలైపోతున్నా. అతన్ని మాత్రం వదిలిపెట్టొద్దు' అంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి ఢిల్లీలో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి సెమిస్టర్‌కు రూ.5 వేలు ఇస్తేనే మార్కులు వేస్తానని లేకపోతే సెమిస్టర్‌తో పాటు ప్రాక్టికల్స్‌లోనూ ఫెయిల్ చేయిస్తానని బెదిరించడంతో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా పద్మనాభమండలం మద్ది గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ (19) అనే యువకుడు ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో ఫైర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 
 
కాలేజీలో పనిచేసే ఓ అధ్యాపకుడు వేధిస్తున్నట్టు గత నెల 30వ తేదీన తల్లిదండ్రులకు వాట్సాప్‌లో లేఖ రాశాడు. ప్రతి సెమిస్టర్‌కు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకపోతే సెమిస్టర్‌తో పాటు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేయిస్తానని బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఢిల్లీకి వెళ్లి కాలేజీలో విచారించగా, హేమంత్ కుమార్ 30వ తేదీనే ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. మరుసటి రోజు ఢిల్లీలోని రైలు పట్టాలపై హేమంత్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
హేమంత్ కుమార్ చనిపోయేముందు వాట్సాప్‌లో తండ్రికి ఓ లేఖ రాశాడు. "నాన్నా నేను చనిపోతున్నా. దీనికి కారణం మా కాలేజీలో ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ బోధించే లెక్చరర్ ఆర్కే.విధాత. ఒక్కో సెమిస్టర్‌కు రూ.5 వేలు చొప్పున మొత్తం 7 సెమిస్టర్‌లకు కలిపి మొత్తం రూ.35 వేలు డిమాండ్ చేస్తున్నాడు. లేనిపక్షంలో ప్రతి సెమ్‌లో రెండు బ్యాక్‌లాగ్స్ ఉంటాయి చూసుకో, ప్రాక్టికల్స్‌లో సంతకాలు కావాలన్నా నా వద్దకే రావాలని అంటూ బెదిరించాడు. చాలా టార్చర్ పెట్టాడు. అందుకే చనిపోవాలనుకున్నా.. కానీ, లెక్చరర్‌ని మాత్రం వదలొద్దు అని పేర్కొన్నాడు.