సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:41 IST)

రోడ్డు పక్కన నగ్నంగా బాలిక.. కాలిన గాయాలు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌లో బాలికలపై ఆకృత్యాలకు అంతులేకుండా పోతోంది. అత్యాచారం.. ఆపై అత్యంత కిరాతకంగా హత్య చేయడం.. వంటి దారుణ ఘటనలు ఇటీవల కాలంలో యుపిలో అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే దాదాపు మూడు ఘటనలు వెలుగు చూడటం ఆందోళనకర విషయం.

ఈ వరుస ఘటనలతో ఆందోళన నెలకొంది. తాజాగా మరో విద్యార్థిని దాదాపు 60 శాతం కాలిన గాయాలతో.. ఒంటిపై బట్టలు లేకుండా న‌గ్నంగా రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న ఘటన షాజహాన్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యార్థిని మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సుఖ్‌దేవానంద్‌ కళాశాలలో బిఎ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం తండ్రితో కలిసి కళాశాలకు వచ్చింది. అయితే, సాయంత్రం 3 గంటలకు కళాశాల ముగిసినా ఆమె బయటకు రాలేదు.

దీంతో కళాశాల గేటు వద్దే వేచి చూస్తున్న ఆమె తండ్రి కంగారు పడి వెతకడం ప్రారంభించాడు. ఆమె లఖ్‌నపూ-బరేలీ జాతీయ రహదారి పక్కన పడిపోయి ఉందని తెలిసింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

దాదాపు 60 శాతం గాయాలయ్యాయని, ముఖం, మెడ, ఛాతి తదితర భాగాల్లో కాలిన గాయాలున్నాయని, మెడ భాగంలో వాపు ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఏ వివరాలూ వెల్లడించే స్థితిలో లేదని, ఆమె కోలుకున్నాకే అసలు ఏం జరిగిందన్న విషయం తెలుస్తుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతు న్నామని ఎస్పీ ఆనంద్‌ వెల్లడించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విద్యార్థిని దుస్తులు కనిపించలేదన్నారు.
 
యుపిలోని షాజహాన్‌పూర్‌ జిల్లాలోనే మరో అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. ఊరి బయట ఉన్న చెరువు వద్దకు స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. సమాచారం తెలుసుకొని వారి కోసం వెతకగా వారిలో ఓ ఐదేళ్ల బాలిక చెరువుకు సమీపంలో ఉన్న పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉంది.

మరో ఏడేళ్ల బాలిక గాయాలతో పక్క ఊరిలో పడిపోయి ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, సోమ, మంగళవారాలు రెండు రోజుల్లోనే లిఖింపుర్‌ జిల్లాలో కళాశాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.