శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:18 IST)

ట్రంప్ ఏమైనా దేవుడా.. ఆయన కోసం అంత హడావుడి ఎందుకు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెలలో భారత పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటన ఈ నెల 24, 25 తేదీల్లో కొనసాగనుంది. ఆయన వెంట భార్య కూడా వస్తున్నారు. అయితే, ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా 70 లక్షల మందితో ఆయనకు స్వాగతం పలకనున్నట్లు వస్తున్న వార్తలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమకు తోచిన రీతిలో సైటైర్లు వేస్తున్నారు. 
 
అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఇందులోనే నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో గుజరాత్ ప్రభుత్వం చేస్తోంది. 
 
అయితే, ట్రంప్‌కుక 70 లక్షల మంది జనాభాతో స్వాగతం పలుకనున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నెటిజన్లు మండిపడుతూ సెటైర్లు వేస్తున్నారు.అహ్మాదాబాద్ జనాభానే 50 నుంచి 55 లక్షల మధ్య ఉంటే 70 లక్షల మంది ఎలాగొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సభలా స్వాగతానికి కూడా జన సమీకరణ చేస్తారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 'నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్' కార్యక్రమం జరిగే మోతేరా స్టేడియం వరకు రోడ్డు షో ఏర్పాటు చేశారు. ఈ రోడ్డులో దాదాపు 70 లక్షల మంది జనం తనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారని వాషింగ్టన్‌లో ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
 
అంతమందితో స్వాగతం పలకడానికి ఆయనేమైనా దేవుడా? అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. ఒక దేశ అధ్యక్షుడి పర్యటనపై అంత హడావుడి దేనికని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై కూడా వారు మండిపడుతున్నారు. ట్రంప్ రాకపై చూపే శ్రద్ధ దేశంలో పేదరికం నిర్మూలనపై చూపాలని వారు హితవు పలుకుతున్నారు.