మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:42 IST)

పాకిస్థాన్‌లోని ముస్లింలకు కూడా పౌరసత్వం కల్పించాలి : శ్రీశ్రీశ్రీ రవిశంకర్

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. వీటికి పార్లమెంట్ ఆమోదముద్ర కూడా వేసింది. అయితే, ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్రానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్యక్షుడు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ ఓ ప్రతిపాదన చేశారు. పాకిస్థాన్‌లో పీడనకు గురవుతున్న ముస్లింలను కూడా పౌరసత్వ సవరణ చట్టంలో చేర్చాలని సూచించారు. 
 
'పౌరసత్వ సవరణ చట్టం అనేది దేశానికి అత్యావశ్యకం. పాకిస్థాన్‌లో ముస్లింలలోని ఓ వర్గం తీవ్ర పీడనకు గురవుతున్నారు. మనం వారి గురించి కూడా ఆలోచించాలి. వారి దేశంలో పీడనకు గురవుతుంటే భారతదేశంలో ఆశ్రయం కల్పించడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు.
 
గతంలో కూడా ఆయన ఇలాంటి సంచలన ప్రతిపాదనే కేంద్రం ముందు పెట్టారు. దేశంలో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా భారత పౌరసత్వం కల్పించాలని ఆయన సూచించారు. 'సీఏఏలో శ్రీలంకీయులను కూడా చేర్చాలని సూచించా. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రచారం చేసి దాదాపు ఒక కోటి సంతకాలను కూడా దీనికి మద్దతుగా సేకరించాం. 35 సంవత్సరాలుగా జీవిస్తున్న శ్రీలంక శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించాలి' అని తాను చేసిన డిమాండ్‌ను రవిశంకర్ మరోమారు గుర్తుచేశారు.