గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (17:35 IST)

సీఏఏను వ్యతిరేకించే వారంతా దళిత వ్యతిరేకులే : అమిత్ షా

పౌరసత్వ సవరణ బిల్లు మూలంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఆరంభంలో ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లు చిచ్చు రేపినా క్రమేపీ పశ్చిబెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 
 
అయితే ఈ చట్టం ముస్లిం వ్యతిరేక చట్టం అని నిరూపించమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నందున రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీల మీద ఆయన మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకించే వారంతా దళిత వ్యతిరేకులని, పేదరిక వ్యతిరేకులని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 
 
సీఏఏపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదన్నారు అమిత్ షా వ్యాఖ్యానించారు. కర్నాటకలోని హుబ్లీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త చట్టం వలన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వచ్చే శరణార్థులలో 70 శాతం దళితులని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని అంతేకానీ దేశాన్ని లేనిపోని అబద్దాలు అసత్యాలతో విడదీయ కూడదని హితవు పలికారు. ప్రతిపక్షాలు ఎన్నివిమర్శలు చేసినా భారతీయ ఆత్మ విడిపోదని అమిత్ షా అన్నారు.