శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (09:35 IST)

మీరు భారతీయులేనా? పౌరసత్వం మీకు వర్తిస్తుందా? కేంద్ర వివరణ

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్న  భారతీయ జనతా పార్టీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు సాగుతున్నాయి. ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. స్వాతంత్ర్యం వచ్చిన 73 యేళ్ల తర్వాత భారతీయులమనే విషయాన్ని నిరూపించుకోవాలా అంటూ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. 
 
ఈ నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న వేళ కేంద్రం స్పందించింది. ఈ చట్టంపై వివరణ ఇచ్చి ప్రజల్లోని అపోహలను తగ్గించే ప్రయత్నం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం గురించి, ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. భారత పౌరసత్వం ఎవరికి లభిస్తుందో కూడా తెలిపింది. '1 జులై 1987కు ముందు దేశంలో జన్మించిన వారితోపాటు, ఎవరి తల్లిదండ్రులైనా ఆ తేదీకి ముందు దేశంలో జన్మించి ఉంటే వారికి పౌరసత్వం లభిస్తుందని, వారంతా భారతీయులుగా గుర్తింపబడతారని స్పష్టం చేసింది. 
 
అలాగే, 2004 పౌరసత్వ చట్టం ప్రకారం దేశంలోని ఎవరి తల్లిదండ్రులైనా ఒకరు భారతీయులు అయి ఉండి, మరొకరు శరణార్థి అయినప్పటికీ వారు భారతీయులే అవుతారని వివరించింది. అయితే, ఇది అసోంలోని వారికి మాత్రం వర్తించదని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రం విషయానికి వస్తే, భారత పౌరుల గుర్తింపునకు 1971ని కటాఫ్‌ తేదీ అని ఆ అధికారి గుర్తు చేశారు. సీఏఏని అసోం ఎన్నార్సీతో పోల్చవద్దని, అసోం కటాఫ్‌ తేదీ వేరు అని పేర్కొన్నారు. 
 
2004లో పౌరసత్వ చట్టంలో చేసిన సవరణల ప్రకారం..
* 1950 జనవరి 26వ తేదీ తర్వాత, 1987 జూలై 1వ తేదీ కంటే ముందు లేదా 1987 జూలై 1వ తేదీ తర్వాత, 2004 డిసెంబర్‌ 3 కంటే ముందు భారత్‌లో జన్మించిన వారు భారత పౌరులే. అయితే వారు జన్మించిన సమయానికి వారి తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై ఉండాలి.
 
* 1992 డిసెంబర్‌ 10న లేదా ఆ తర్వాత, 2004 డిసెంబర్‌ 3 కంటే ముందు ఎవరైనా విదేశాల్లో జన్మించి ఉంటే, వారు పుట్టిన తేదీ నాటికి వారి తల్లిదండ్రుల్లో ఒకరు జన్మతః భారత పౌరులై ఉంటే వారిని కూడా భారతీయులుగా పరిగణిస్తారు.
 
* 2004 డిసెంబర్‌ 3 తర్వాత భారత్‌లో జన్మించి, వారి తల్లిదండ్రులు ఇద్దరూ భారత పౌరులై ఉంటే లేదా తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరుడై ఉండి, మరొకరు అక్రమ వలసదారు కాకపోతే వారిని కూడా భారతీయులుగానే పరిగణిస్తారు.