1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (18:47 IST)

ఫోన్ నంబర్లకు చార్జీలు వసూలు చేసే ప్రణాళిక లేదు : ట్రాయ్ స్పష్టం

mobile number
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినియోగంలో ఉన్న ల్యాండ్ లైన్, మొబైల్ నంబర్లకు కూడా చార్జీలు వసూలు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - ట్రాయ్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ట్రాయ్ శుక్రవారం వివరణ ఇచ్చింది. మొబైల్ నంబర్లకు చార్జీలు వసూలు చేయాలన్న ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేసింది. నంబరింగ్ వనరుల నియంత్రణ నిమిత్తం ఇటీవల ట్రాయ్ రివిజన్ ఆఫ్ నేషనల్ నంబరింగ్ ప్లాన్ పేరుతో ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీంతో ఈ చార్జీల వార్తలు వెల్లువెత్తాయి. ఫోన్ నంబర్లను కూడా విలువైన వనరుగా భావిస్తూ వాటి కేటాయింపునకు చార్జీ విధించాలని ట్రాయ్ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రాయ్ క్లారిటీ ఇచ్చింది. 
 
"నంబరింగ్ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లకు ఫీజులు వసూలు చేయాలని ట్రాయ్ ప్రతిపాదించినట్టు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదారి పట్టించేదే. టెలీకమ్యూనికేషన్, ఐడెంటిఫైర్స్ వనరులపై పూర్తి నియంత్రణ కలిగి టెలికాం శాఖ ఇటీవల ట్రాయ్‌ని సంప్రదించి నేషనల్ నంబరింగ్ ప్లాన్‌పై ప్రతిపాదనలు కోరింది. నంబరింగ్ వనరుల సమర్థ వినియోగం కోసం సూచనలు ఇవ్వాలని కోరింది. దీంతో మేం చర్చాపత్రం విడుదల చేశాం. నంబర్ల కేటాయింపు విధానాల్లో కొన్ని సవరణలు మాత్రమే ప్రతిపాదించాం" అని వివరణ ఇచ్చింది.