శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (17:10 IST)

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ముక్కలు చేసి జాతికి అంకితం : నరేంద్ర మోడీ

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా కేంద్రం విడగొట్టింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కొత్త కంపెనీలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 
 
భవిష్యత్ టెక్నాలజీలో కొత్త కంపెనీలు ముందు ఉండాలని సూచించారు. కొత్త కంపెనీలకు స్టార్టప్‌లు సహకరించాలని కోరారు. స్వదేశీ శక్తిపై భారత రక్షణ రంగం అభివృద్ది చెందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. 
 
‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమంలో భాగంగా మన దేశాన్ని సొంత శక్తితో ప్రపంచంలోనే అతి పెద్ద మిలటరీ పవర్‌‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఇందులో భాగంగా మన దేశంలోని డిఫెన్స్ పరిశ్రమలు అధునాతనంగా సిద్ధంకావాలన్నారు. 
 
మన లక్ష్యం కేవలం ఇతర దేశాలతో సమానం కావడం కాదని, ప్రపంచ దేశాలను లీడ్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. ఇందుకోసం కొత్తగా ఏర్పాటైన ఏడు ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు రీసెర్చ్‌, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోడీ సూచించారు. 
 
గడిచిన ఐదేండ్లలో భారత్ నుంచి డిఫెన్స్ ఎగుమతులు 315 శాతం పెరిగాయని, ఇది మరింత పెంచేలా కృషి చేస్తామని అన్నారు. కాగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా విడగొట్టడం చారిత్రక నిర్ణయమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కొత్త కంపెనీలతో రక్షణ రంగం సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.