గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

danishh kaneria
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ దేశానికి చెందిన హిందూ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ పాత్ర లేదా ప్రమేయం లేకపోతే, ఆ దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా, దాడి తర్వాత సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనిక బలగాలను ఎందుకు మొహరిస్తున్నారని, ఎందుకు అప్రమత్తం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు డానిష్ కనేరియా తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 
 
"పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర నిజంగా లేకపోతే ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు? మీ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి? ఎందుకంటే లోతుగా మీకు నిజం తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారిని పెంచి పోషిస్తున్నారు. ఈ చర్యకు సిగ్గుపడాలి" అని డానిష్ కనేరియా ఏకిపారేశాడు. 
 
పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచల నిర్ణయం!! 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందం 1960ని రద్దు చేసింది. ఈ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే, అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు తక్షణమే మూసివేత. సరైన ధృవపత్రాలతో భారత్‌కు వచ్చినవాళ్లే మే ఒకటో తేదీలోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. 
 
సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధాన్ని విధించింది. దీనికింద గతంలో ఇచ్చిన వీసాలూ రద్దు. ఈ వీసా కింద ఇప్పటికే భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది. 
 
భారత్‌లోని పాక్ హైకమిషనర్‌లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారుల వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశించింది. ఇదేసమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్‌లో ఉన్న త్రివిధ దళాల సలహాదారులను ఉపసంహరించుకుంటుందని వెల్లడించింది. అలాగే, ఇరు వైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 
 
మరోవైపు, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వీరిలో నేపాల్ జాతీయుడు కూడా ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. అదేసమయంలో ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల తహవ్వుర్ రాణాను భారత్‌కు రప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.