బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (21:52 IST)

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: కుల్‌భూషణ్‌ కేసుపై పాక్ ఆంక్షలు

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్‌లో జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకదళ రిటైర్ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. జాదవ్ కేసులో భారత రాయబార కార్యాలయం నుంచి ప్రతిబంధకం లేని న్యాయ సహాయాన్ని పాకిస్తాన్ గురువారం తోసిపుచ్చింది.
 
జూలై నెలలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అనుసరించి జాదవ్‌ను భారత దౌత్యాధికారులు కలుసుకోవడానికి అంగీకరిస్తూనే.. తమ దేశ చట్టాల ప్రకారం మూడు నిబంధనలు పెడుతున్నట్లు పాక్ పేర్కొంది.
 
జాదవ్‌ను భారత అధికారులు కలిసే సమయంలో వారితో పాటు పాకిస్తాన్ అధికారి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే వీటిపై భారతదేశం అభ్యంతరం తెలిపింది.
 
వియన్నా ఒప్పందం ప్రకారం... విదేశాల్లో బందీలుగా ఉన్న వ్యక్తులను వారి మాతృదేశాలకు చెందిన అధికారులు ఏ ఆటంకం లేకుండా కలుసుకోవచ్చన్న నిబంధనను భారత్ ప్రస్తావించింది.
 
అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేసినప్పటికీ పాక్ వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం. అయితే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలోనే కుల్‌భూషణ్ వ్యవహారంలో ఆటంకాలు సృష్టిస్తోందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.