శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (17:37 IST)

అటల్ పెన్షన్ యోజన స్కీమ్: ఈ పెన్షన్ పొందాలంటే..?

కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను అందిస్తోంది. అందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ పాపులర్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరేవారికి వృద్ధాప్యంలో రూ.1,000 నుంచి రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.
 
ఈ పెన్షన్ పొందాలంటే స్కీమ్‌లో చేరిననాటి నుంచి ప్రతీ నెలా కొంత మొత్తం జమచేస్తూ ఉండాలి. జమ చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ లభిస్తుంది. ఈ పాపులర్ పెన్షన్ స్కీమ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే 99 లక్షల మంది చేరారు. అంటే సుమారు 1 కోటి మంది ఈ స్కీమ్‌లో చేరారు. 2022 మార్చి నాటికి ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 4.01 కోట్లు దాటింది.
 
చిన్న వయస్సు నుంచే రిటైర్‌మెంట్‌ ఫండ్‌పై దృష్టి పెట్టాలనుకునేవారికి అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) అందుబాటులో ఉంది. ముఖ్యంగా టీనేజర్లు ఈ పథకంలో చేరితే మిగతా వయస్కులకన్నా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ ప్రీమియం పెరిగే ఈ పథకానికి 18-40 ఏళ్లవారు అర్హులు.
 
18 ఏళ్లవారు ఈ పథకంలో చేరితే 42 ఏళ్లపాటు ప్రీమియంలు చెల్లిస్తూ పోవాలి. అలాగే 40 ఏండ్లవారు.. మరో 20 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఖాతాదారుల వయస్సు ఏదైనా.. వారికి 60 ఏళ్లు వచ్చేదాకా ప్రీమియం చెల్లింపులు కొనసాగుతాయి.
 
60 ఏళ్లు పూర్తయ్యాక లబ్ధిదారులు పెన్షన్‌ కోసం ఏపీవై ఖాతా ఉన్న బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌ శాఖను సంప్రదించాలి. 60 ఏళ్ల లోపే లబ్ధిదారు చనిపోతే భర్త లేదా భార్యకు ప్రీమియంలు కొనసాగించే అవకాశం. లబ్ధిదారుడి వయస్సు ప్రకారమే చెల్లింపు కాలం ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే సెటిల్మెంట్‌ చేసుకోవచ్చు.
 
పెళ్లి కానట్టయితే స్కీం కొనసాగింపునకు అవకాశం ఉండదు. నామినీగా ఉన్నవారికి నిబంధనల ప్రకారం ఏకమొత్తాల్ని చెల్లిస్తారు. లబ్ధిదారుడు చనిపోయినప్పుడు భర్త లేదా భార్య పథకాన్ని కొనసాగించాలనుకుంటే నామినీగా మరొకరు వస్తారు.
 
గడువు అనంతరం పెన్షన్‌ పొందవచ్చు.పెన్షన్‌ కాలంలో వీరు మరణిస్తే నామినీలకు ఏకమొత్తాల్ని చెల్లిస్తారు. 60 ఏళ్ల తర్వాత లబ్ధిదారుడు చనిపోతే నామినీకి వారి కోరిక మేరకు పెన్షన్‌ లేదా సెటిల్మెంట్‌ చేస్తారు.