1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 28 జూన్ 2023 (14:32 IST)

ఒక దేశంలో రెండు చట్టాలు ఎలా.. ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలి : ప్రధాని మోడీ

pmmodi
ఒక దేశంలో రెండు చట్టాలు ఉండటం ఏమాత్రం సబబు కాదని, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని భారత రాజ్యాంగం చెబుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో జరిగిన బీజేపీ వర్కర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒకే దేశంలో రెండు రకాల చట్టాలు పని చేయవన్నారు. 
 
దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం చెపుతోందని... ఉమ్మడి చట్టాలు ఉండాలని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పిందని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని... ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలను బీజేపీ చేయదన్నారు. 
 
ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక న్యాయం, మరొక వ్యక్తికి మరో న్యాయం ఉంటాయా? అని మోడీ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటే ఆ కుటుంబం మనుగడ సాగించగలదా? అని అడిగారు. ఇలాంటి ద్వంద్వ విధానం ఉంటే దేశం ఎలా ముందుకు సాగుతుందన్నారు. 
 
రాజ్యాంగంలో కూడా అందరికీ సమాన హక్కులు ఉంటాయనే విషయం స్పష్టంగా ఉందని చెప్పారు. విపక్షాలు ఎప్పుడూ ముస్లిం జపం చేస్తుంటాయని... నిజంగా ముస్లింలపై వారికి అంత నిజమైన ప్రేమ ఉంటే ముస్లింలు విద్య, ఉద్యోగాల విషయంలో ఎందుకు వెనుకబడ్డారని ప్రశ్నించారు. ఇపుడు మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
 
మరోవైపు, ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంబంధించి న్యాయపరమైన కోణంలో ఏం చేయవచ్చనే దానిపై వీరు చర్చించారు. లాయర్లు, న్యాయశాస్త్ర నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలను లా కమిషన్‌కు అందించాలని వీరు నిర్ణయించారు.