సోమవారం, 7 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (14:46 IST)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

pamban bridge
దేశంలోనే తొలి వర్టికల్ లిప్ట్ రైల్వే సముద్రపు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. భారత భూభాగాన్ని సముద్రతీర ప్రాంతమైన రామేశ్వరంతో కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. దీన్ని శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతక పరిజ్ఞానంతో రూ.535 కోట్లు వెచ్చించి తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో ఈ వంతెనను నిర్మించారు. 
 
2020 రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్ఎల్) కంపెనీ ఈ పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తి చేసింది. 2.08 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా, కింది నుంచి ఓడలు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 2019 మార్చి ఒకటో తేదీన ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయగా, మార్చి 6వ తేదీ 2025న ఈ వంతెనను ఆయన ప్రారంభించారు. మోడీ పచ్చజెండా ఊపగానే ఈ వంతెనపై నుంచి రామేశ్వరం - చెన్నై తాంబరం ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరి వెళ్లింది. 
 
అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం - నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం లైన్ క్లియర్ అయింది. ఈ రైల్వే లైను నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇందుకోసం చేపట్టిన భూసేకరణ కొంతమేరకు కొలిక్కివచ్చింది. ఈ నేపథ్యంలో రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. తొలుత 27 కిలోమీటర్ల ట్రాక్‌తో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మరో రెండు నెలల్లో టెండర్లు ఆహ్వానించనున్నారు. 
 
కాజీపేట - విజయవాడ లైనులోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి మొదలయ్యే ఈ రైల్వే లైను అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ - గుంటూరు లైనులో కలుస్తుంది. ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 57 కిలోమీటర్లు. 27 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి రూ.450 కోట్లు, కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా వేశారు. అయితే, రెండేళ్లలోనే పూర్తి చేయాలని రైల్వే శాఖను సీఎం చంద్రబాబు కోరారు. 
 
ట్రాక్ నిర్మాణం రెండేళ్ళలో పూర్తవుతుందని, కానీ, వంతెన నిర్మాణానికి మూడేళ్లు పడుతుందని రైల్వే శాఖ చెబుతోంది. అలాగే, అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలుస్తారు. సీఆర్‌డీఏ పరిధిలోని తాడికొండ ప్రాంతంలో రైల్వే లైనుకు భూమిల్చేందుకు రైతులు అభ్యంతరం చెబుతుండటంతో అమరావతి నుంచి నంబూరు వరకు 26.5 కిలోమీటర్ల రైల్వే లైను పనులు మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.