సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (14:43 IST)

చంద్రయాన్-3 ల్యాండింగ్‌.. దక్షిణాఫ్రికా నుంచి వీక్షించనున్న మోదీ

Modi
మన దేశంలోని కోట్లాది మంది ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే సమయం ఆసన్నమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ చివరి దశకు చేరుకుంది. అన్నీ సవ్యంగా జరిగితే, ఈ సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతాయి. 
 
చంద్రయాన్ విజయవంతం కావాలని దేశంలోని కోట్లాది మంది దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. పాకిస్థాన్ ప్రజలు కూడా ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటే.. ప్రపంచం మొత్తం దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోందని అర్థం చేసుకోవచ్చు. 
 
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. 15వ బ్రిక్స్ సదస్సు కోసం ఆయన మూడు రోజుల పర్యటనకు వచ్చారు. చంద్రుడిపై అడుగు పెట్టి మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని మొదటి నుంచీ పట్టుబట్టారు. సెప్టెంబర్ 7, 2019న, చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను చూసేందుకు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు. 
 
అయితే, విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో దేశం మొత్తం తీవ్ర నిరాశకు లోనైంది. ఆ బాధను తట్టుకోలేక అప్పటి ఇస్రో చీఫ్ కె.శివన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది. ఆ సమయంలో ఆయనను మోదీ స్వయంగా ఓదార్చారు. మనం విఫలం కాలేదని, చంద్రుడిని ముద్దాడాలనే మన ఆకాంక్ష మరింత బలపడిందని మోదీ ఆ సందర్భంగా అన్నారు. 
 
చంద్రయాన్-3 ల్యాండింగ్ యొక్క కీలక క్షణాన్ని దక్షిణాఫ్రికాలో ప్రధాని నరేంద్ర మోడీ ఎలా చూడబోతున్నారని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దక్షిణాఫ్రికా నుంచి చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను మోదీ వీక్షించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.