సౌతాఫ్రికా వేదికగా 15వ బ్రిక్స్ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోడీ
బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దక్షిణాఫ్రికా రాజధాని జోహనెన్స్‌బర్గ్‌కు బయలుదేరి వెళ్ళారు. మంగళవారం మొదలయ్యే 15వ బ్రిక్స్ సదస్సు మూడు రోజులు కొనసాగుతుంది. ప్రధాని మోడీ పర్యటన వివరాలను సోమవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు.
ఈ సదస్సులో భారత్‌తోపాటు చైనా కూడా పాల్గొననుండటం విశేషంగా మారింది. మోడీ, చైనా ఆధినేత జీ జిన్‌పింగ్ మధ్య చర్చకు అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు ఖ్వాత్రా స్పందిస్తూ చర్చలు, ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన ప్రధాని సదస్సు షెడ్యూల్ తయారవుతోందన్నారు.
బ్రిక్స్ సదస్సు అనంతరం బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్చ్, బ్రిక్స్ ప్లస్ డైలాగ్' అనే పేరిట జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. భారత్- దక్షిణాఫ్రికా దౌత్య సంబంధాలు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన విశేష ప్రాధాన్యత సంతరించుకున్నదని తెలిపారు.
కాగా, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో ఆయన పర్యటించడం ఇది మూడోసారి. ఆగస్టు 25, సదస్సు ముగిసిన మరుసటిరోజు గ్రీస్ దేశంలో మోడీ పర్యటిస్తారని ఖ్వాత్రా తెలిపారు. ప్రధాని వెంట వ్యాపారుల బృందం బ్రిక్స్ సదస్సులో పాల్గొంటుందని ఖ్వాత్రా వివరించారు.