మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (10:46 IST)

రాజకీయాలు చాలా డేంజర్.. ప్రతిదీ ఓ గేమ్ : రజనీకాంత్

రాజకీయాలు చాలా ప్రమాదకరమని, ప్రతిదీ ఒక గేమ్‌, డ్రామాలా ఉంటుందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆయన నటించిన తాజా చిత్రం "2.O". గత నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్.. తాజాగా తన రాజకీయ ప్రవేశంపై స్పందించారు. 
 
తాను పూర్తి స్థాయి రాజకీయనేతగా ఇంకా మారలేదన్నారు. పైగా, తనకు రాజకీయాల్లో అనుభవం చాలా తక్కువ అని చెప్పారు. సాధారణంగా సినిమాల్లో నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, ఇలా వేర్వేరు విభాగాలకు వేర్వేరు వ్యక్తులు ఉంటారన్నారు. కానీ, రాజకీయాల్లో అలా కాదన్నారు. అన్నీ తానే చూసుకోవాల్సి ఉంటుందన్నారు. 
 
ముఖ్యంగా, రాజకీయాలు చాలా ప్రమాదకరమని, ప్రతిదీ ఒక గేమ్, డ్రామాలాగానే ఉంటుందన్నారు. అందుకే రాజకీయాల్లో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉంటూ, ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందన్నారు. అదేసమయంలో తాను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే తాను తానుగానే ఉంటానని, మిగిలిన రాజకీయనేతల్లా మారిపోనని చెప్పారు. ప్రస్తుత తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకుని రావడమే తన తక్షణ కర్తవ్యమన్నారు. 
 
తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో నాయకత్వ లోపం చాలా ఉందని తెలిపారు. తమిళ ప్రజలు చాలా తెలివైన వారని.. వారిలో కష్టపడేతత్వం చాలా ఉందని అయితే వారు ఆ విషయాలను మర్చిపోతున్నారన్నారు. వారిని చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.