ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎన్నికల సంఘం నిషేధం
ఈ నెలలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ దృష్ట్యా 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీఐ అధికార ప్రతినిధి ఎస్.శరణ్ ఓ ట్వీట్ చేశారు.
'ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, పోల్ సర్వేలు సహా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశాలను ఆయా పోలింగ్ కేంద్రాల్లో నిర్దిష్ట పోలింగ్ గడువు ముగిసేంతవరకూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయకుండా నిషేధించాం' అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 21వ తేదీ 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
వీటితోపాటు బీహార్, అస్సోం, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గడ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయా, ఒడిషా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదే రోజున పోలింగ్ జరుగనుంది.
వీటితో పాటు మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్టిపూర్ పార్లమెంటరీ నియోజవర్గాలకూ 21వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 24న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అందుకే పోలింగ్ ముగిసేంతవరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.