మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (14:27 IST)

ఒక్క రూపాయి జరినామా లేదా 3 నెలల జైలుశిక్ష.. ఎవరికి?

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడిన కేసులో ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు అత్యున్నత న్యాయస్థానం అపరాధం విధించింది. కేవలం ఒక్క రూపాయి జరినామా చెల్లించాలని ఆదేశించింది. ఈ అపరాధం సెప్టెంబరు 15వ తేదీ లోపు చెల్లించాలని లేనిపక్షంలో మూడు నెలల జైలు శిక్షతో పాటు.. మూడేళ్ళపాటు న్యాయవాద వృత్తికి దూరంగా ఉండాలని ఆదేశించింది., 
 
ఇటీవల ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ప్రస్తుత సీజే జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేపై అమర్యాదకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, మాజీ ప్రధాన న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు, కొన్ని రోజుల క్రితం సీజే బోబ్డే ఖరీదైన బైక్‌‌పై హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారని ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.
 
ఈ వ్యాఖ్యాలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో శిక్ష విధింపుపై కూడా వాదనలు ఆలకించిన కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 
 
ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ఒక్క రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆయనను ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోపు రూ.1 జరిమానా కట్టడంలో విఫలమైతే కనుక, మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేయకుండా నిషేధం విధిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 
 
కాగా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడంపై ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు. దీంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడి త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింది. 
 
తనకు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుని అభిప్రాయాలను వ్యక్తం చేశానని ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో శిక్షను ఖరారు చేసింది.